నటశిక్షణా పద్ధతులు తెలుసుకొనే ముందు, నటన పుట్టు పూర్వోత్తరాలు – చరిత్ర , అసలు నటన అంటే ఏమిటి తెలుసుకుందాం….

నాట్యశాస్త్రం ప్రకారం నటన అంటే అభినయము అంటారు.

” ఆంగికం భువనం యస్య, వాచికం సర్వ వాఙ్మయం,

  ఆహార్యం చంద్ర తారాది తం, వందే సాత్వికం శివమ్”

ఎవని ఆంగికం విశ్వమంతా వ్యాపించి యున్నదో, ఎవని వాచికం అనేక భాషలుగా వర్ధిల్లుతుందో, ఎవని ఆహార్యం ( costumes & make up ) చంద్రుడు తార మొదలైనవిగా అలకరించుకున్నారో, అటువంటి సత్వ స్వరూపుడైన నటరాజుకు నమస్కరిస్తున్నాను.

అభినయము నటరాజంత ప్రాచీనమైనది భారతీయుల భావన. మనిషి సంఘజీవి – తన సుఖ దుఃఖాలను తోటివారితో పంచుకోకపోతే మానసిక శాంతి లభించదు. ఆ శాంతిని పొందడానికే తన సన్నిహితులకు విజయాలను , అపజయాలను చెప్పుకుంటాడు.  ఈ మనసు విప్పి మాట్లాడుకోవడాలు మన నిత్య జీవిత అనుభవాలు. భాషే లేని రోజుల్లో సంజ్ఞల ద్వారా తన ఆలోచనలు, ఆవేదనలు, సంవేదనలు తన వారితో స్పష్టంగా పంచుకోవడానికి చేసిన ప్రయత్నం కొన్ని వేల సంవత్సరాలలో భాషగా రూపుదిద్దుకుంది.

13 వేల బి.సి. నాటికే గుర్రాలను, ఏనుగులను, జింకలను గుహాల్లో , గోడల మీద రంగులతో చిత్రించారన్నది చారిత్రిక సత్యం. ఆ పాతరాతి యుగంలో అభినయానికి నాంది జరిగినదని ఒక ఊహా ప్రదర్శన ను ” Length and Depth of Acting ”  పుస్తకంలో ఉదహరించారు.

” అది ఒక గుహ ముందు భాగం, నెగడు మండుతుంది ( camp fire).  ఆ నెగడు చుట్టూ సంజ్ఞల ద్వారా ( signs), అరుపుల ద్వారా వారి వారి మనోగతాలను తెలియచెప్పుకొనే ఒక తండా, అందరూ గుంపుగా కూర్చొని వున్నారు. ఆ తండా నాయకుడు కాస్త దూరంగా, మిగిలిన వారికి ఎదురుగా కూర్చొని ఉన్నారు. వారి మధ్యన ఓ చచ్చిన సింహం పడి ఉంది. ఆ గుంపులో నుండి ఒకతను లేచి…. “ఈ సింహాన్ని నేనే చంపాను…. నేను అడవిలో నడుచుకుంటూ వెళుతున్నాను, నన్ను ఎవరో ఫాలో అవుతున్నారు అని అనుకున్నాను, తిరిగి చూస్తే సింహం, అది ఎగిరి నా మీద దూకింది, నేను పక్కకి తప్పుకున్నాను, నా బరిసెతో ( ఇనుప ఆయుధం) పొడిచాను, అది క్రింద పడిపోయింది ” అని అరుపుల ద్వారా , సంజ్ఞల ద్వారా చెప్పాడు, ఆ అరుపులు,సంజ్ఞలు అందరూ చూస్తున్నారు చప్పగా , వాళ్ళకి ఏమి అర్థం కాలేదు, ఆ చెప్పేవాడికి తను చెప్పే పద్ధతి నచ్చలేదు, ఉన్నట్టుండి తన బుర్రలో ఓ మెరుపు మెరిసింది, ఇంతకన్నా బాగా చెప్పే విధానం అతనికి తట్టింది, చెప్పడం కాదు చేసి చూపెడతా చూడండి అంటూ – ఎదురుగా కూర్చున్న వాడికి సంజ్ఞ చేసాడు…. ” లే, నువ్ సింహానివి, నేను నిన్ను చంపుతాను, ఈ సింహం చర్మం నీ మీద కప్పుకో అని సంజ్ఞల ద్వారా చెబుతూ , ఆ పక్కనే ఉన్న ఒక సింహం చర్మాన్ని ఎదురుగా ఉన్న వాడి మీదికి విసిరాడు, ఎదురుగా ఉన్న వాడు ఆ సింహం చర్మం భుజాల మీద కప్పుకున్నాడు, మోకాళ్ళ మీద వంగి, చేతులు నేల మీద ఆనించి సింహంలా నడుస్తున్నాడు, మధ్య మధ్యలో సింహంలా గర్జిస్తున్నాడు.

వాడు సింహం కాదు, పాడూ కాదూ, మనిషి సింహం తోలు కప్పుకున్నంత మాత్రాన సింహంలా అయిపోతాడు ఏమిటి, సింహంగా మారకపోతే పోనీ, కనీసం సింహంలా కనిపించడం లేదు అని అనుకుంటుండగా…… ఇంతలో ఏదో మంత్రం వేసినట్టు, వాళ్ళ కళ్ళ ముందు సింహం కదలాడిన భ్రమ కలిగింది, వాడు వాళ్ళ వాడే కానీ ఇప్పుడు సింహం కూడాను. వాళ్లిద్దరూ ఆ తండా కంతటికి సింహాన్ని ఎలా చంపారో అభినయించి చూపారు. సింహం చంపేస్తుందో నన్న భయాన్ని, సింహంతో పోరాడేటప్పుడు వీర రసాన్ని, సింహం చచ్చిపోయినప్పుడు ఆనందాన్ని అనుభవించారు. తండాను రసప్లావితం ( feel )  చేయగలిగినందుకు సింహాన్ని చంపినవాడు, సింహం లా ప్రవర్తించిన వాడు ఇద్దరూ పరవసించిపోయారు.

అప్పటినుండి 10 వేల అస్పష్టమైన సంవత్సరాలు ( అస్పష్టమైన అని ఎందుకు అంటున్నాను అంటే, స్పష్టమైన రికార్డ్ లేదు కనుక). ప్రతి తండాలో, ప్రతి గుంపులో, వాళ్ళ సాహసాలు ,నమ్మకాలు ప్రదర్శిస్తూనే వున్నారు, ఆ అభినయం మొరటుగా (crude) , సంక్షిప్తంగా (brief) ఉండి ఉండవచ్చు. నటన పుట్టు పూర్వోత్తరాలు – చరిత్ర లో ఇది మొదలు మాత్రమే…..

By Acting Professor : Potti Prasad ( FTIH )