నటుడవ్వడానికి కావలసిన అర్హతలు ఏమిటి ? ఎవరయినా నటులవ్వచ్చు కదా, మరి అందరూ నటులు కారేం ?
శిక్షణ పొందిన వాళ్లలో కూడా కొంతమందే వెలుగులోకి రావడానికి కారణం ఏమిటి ?
నటుడవ్వడానికి కావలసిన మొదటి అర్హత ” నేను నటుణ్ణి అవ్వాలి ” అన్న దృఢసంకల్పమే. ఈ సంకల్ప బలం ప్రయత్నం చేసిన అందరిలోనూ ఉండదు. నటులకు లభించే గుర్తింపు , ప్రశంసలను చూసి, సినిమాల్లో నటుడిగా లక్షలూ , కోట్లు పెట్టుబడి లేకుండా సంపాదించవచ్చనే ఆశతో , అన్నిటికన్నా ముఖ్యం నటిమణులతో పరిచయాలు సులువుగా పెంచుకోవచ్చనే దురాశతో దిగినవాళ్లు చేతులు కాల్చుకొని, ఆ ఆశలు ఆడియాసలని గ్రహించి నెమ్మదిగా వేరే ప్రొఫెషన్ లోకి మారిపోతారు.
ఎవరికయితే ధృడంగా నటుణ్ణి కావాలనే సంకల్పం ఉంటుందో అతను “కృషి” చేస్తే తప్పకుండా మంచి నటుడవుతాడు. స్టార్ అవుతాడో లేదో ప్రేక్షకులు నిర్ణయిస్తారు.
నాటకాల్లో నటించే నటులంతా  పద్యం చదవడం , మాటలు పలకడం గురువు or దర్శకుడి దగ్గర సాధనచేసి , Trail and error Method తో మెళకువలు గ్రహించి వారి వారి శైలితో ప్రసిద్ధులవుతారు అన్న సంగతి ఏ నాటక నటుణ్ణి అడిగినా చెబుతారు….
నటశిక్షణాలయాల్లో శిక్షణ పొందని సినిమా నటులు, నటీమణులందరూ , వారికి అవకాశం ఇచ్చిన దర్శకుల దగ్గరే నేర్చుకొని మహనటులయ్యారు. అయితే అది కెమెరాల ముందు నేర్చుకున్న విద్య కనుక , ఆ దర్శకుడి శ్రమంతా దర్శకుని సూచనలుగా భావించి ” శాపవశమున భూలోకమున అవతరించిన గంధర్వులు ” గా పరవశించి పోతుంటారు. అది వారి అవగాహన లోపం మాత్రమే.
మరి “నట శిక్షణ” అంటే ఏమిటి ? డైలాగులు నేర్పుతారా , హావభావాలు నేర్పిస్తారా అని అడుగుతారు చాలా మంది.
 డైలాగులు నేర్పించడం , కెమెరాల ముందు ఎలా ప్రవర్తించాలి అని చెప్పడం మాత్రమే నటశిక్షణ కాదు.
వైణుకుడికి వీణల , చిత్రకారుడికి కాన్వాస్ లా, శిల్పికి శిలలా, నటుడికి తన పరికరం “తన శరీరం”. శరీరం అంటే గొంతు, మనసు కూడా అందులో కలిసే ఉంటాయి. శరీరాన్ని , స్వరాన్ని , మనస్సు ను మాధ్యమాలకు  అనుగుణంగా శృతి చేసుకోవాలి. ఆ శృతి చేసుకోవడానికి చేసే సాధనే “నటశిక్షణ” .
” రాయిలా పడివున్న ఒక శిలను చూసిన శిల్పి, ఆ రాయిని అందమైన శిల్పంగా మలిచాడు. ఆ అద్భుతమైన శిల్పాన్ని చూడడానికి వేలాది మంది తరలివచ్చారు, ఆ శిల్పాన్ని చూసిన వారంతా మహా అద్భుతంగా చెక్కారు అన్నారు. ఇంత అద్భుతంగా ఎలా చెక్కారు అని అడిగాడు ఒక అభిమాని, ఆ శిల్పిని.
శిల్పి చిరునవ్వు నవ్వి , మీరు చూస్తున్న “అద్భుతశిల్పం” ఆ రాయిలోనే ఉంది, నా ఉలితో కన్ను దగ్గర అనవసరంగా ఉన్న రాయిని తొలగించా – కన్ను బయట పడింది, ముక్కు దగ్గర అనవసరంగా ఉన్న రాయిని తొలగించా – ముక్కు బయట పడింది అన్నాడు. సృజనాత్మక కళలన్నీ – ముఖ్యంగా నటులు , ఆ శిల్పంలాగానే తయారవుతారు. నటశిక్షణ లో  – సాధనతో ( practice) అనవసరమైన లక్షణాలను తొలగించి వ్యక్తీకరించడానికి కావలసిన లక్షణాలను శృతి చేసుకుంటాడు.
Every Art Begins with imitation and Ends with creation
నటశిక్షణలోని పద్ధతుల గురించి ఇంకో పోస్టులో తెలుసుకుందాం……
By Acting Professor : Potti Prasad ( FTIH )